Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫ్యూయల్‌ స్విచ్‌లో లోపం లేదు.. ఎయిరిండియా ప్రమాదంపై ప్రభుత్వం కీలక ప్రకటన

Air India Boeing Dreamliner crash investigation update in Parliament
Advertisement
  • పరీక్షల్లో అసాధారణంగా ఏమీ కనిపించలేదని వెల్లడి
  • థ్రస్ట్‌ కంట్రోల్‌ మాడ్యూల్‌పై దర్యాప్తు కొనసాగుతుందన్న కేంద్రం
  • తుది నివేదిక చివరి దశలో ఉందని వెల్లడి
  • పార్లమెంటులో వివరాలు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
Advertisement
అహ్మదాబాద్‌లో గతేడాది జూన్‌ 12న కుప్పకూలిన ఎయిరిండియా బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ ప్రమాదంపై దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బందితో పాటు నేలపై ఉన్నవారూ కలిపి 260 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఫ్యూయల్‌ కంట్రోల్‌ స్విచ్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే వాటిపై నిర్వహించిన అధునాతన పరీక్షల్లో ఎలాంటి సాంకేతిక లోపం గుర్తించలేదని కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంట్‌కు తెలిపింది.

రాజ్యసభలో కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్‌ ఈ వివరాలు వెల్లడించారు. ఫ్యూయల్‌ కంట్రోల్‌ స్విచ్‌ను తయారీ సంస్థ వద్ద సమగ్రంగా పరీక్షించగా, లాకింగ్‌ వ్యవస్థలో అసాధారణంగా ఏమీ కనిపించలేదన్నారు. డీజీసీఏ ఆదేశాల మేరకు విమాన భద్రతా తనిఖీల్లో భాగంగా ఈ పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు.

అయితే పూర్తి స్థాయి థ్రస్ట్‌ కంట్రోల్‌ మాడ్యూల్‌ పరిశీలన ఇంకా కొనసాగుతోందని మంత్రి తెలిపారు. అమెరికాలోని సియాటిల్‌లో ఉన్న తయారీ కేంద్రంలో ఈ పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ పరీక్షల ఫలితాల కోసం దర్యాప్తు అధికారులు ఎదురుచూస్తున్నారని వెల్లడించారు.

ఈ ప్రమాదంపై విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) తుది నివేదిక ఆలస్యమైందన్న విమర్శలను కూడా ప్రభుత్వం తోసిపుచ్చింది. భారీ విమాన ప్రమాదాల దర్యాప్తునకు నిర్దిష్ట కాలపరిమితి ఉండదని స్పష్టం చేసింది. ప్రమాదానికి దారితీసిన అన్ని కారణాలను పరిశీలిస్తున్నామని, దర్యాప్తు పూర్తయిన వెంటనే తుది నివేదికను ఏఏఐబీ వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది.
Advertisement
Advertisement
Air India
Ahmedabad plane crash
Boeing Dreamliner
Fuel control switch
Civil Aviation Ministry
AAIB investigation

More Telugu News